మనకి ఇష్టం అయిన వాళ్ళు మన జీవితంలో నుంచి వేరే దారికి వెళ్ళటం వేరు, జీవితం నుంచే వెళ్ళిపోవటం వేరు. ఆ రెండు నెలలు ముందు వరకు తెలియనేలేదు నిశ్శబ్దం, చీకటితో చెలిమి భారంగా ఉన్న కానీ అవసరం అని తోడయితే ఎలా ఉంటుంది అనేది,
ఇది నా స్నేహితురాలు “చిత్ర” కథ, వాళ్ళ నాన్న గారు కాలం చేసి రెండు నెలలు దాటింది, తను బయటకి వచ్చిందే లేదు. మనకి తెలిసిందే కదా అమ్మాయికి ఎప్పుడు వాళ్ళ నాన్నే అన్నిటికంటే ముందు అని, శివయ్య తన పిల్లలని తండ్రి అనే పేరుతో భైరవ రూపాన కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అనిపిస్తుంది అప్పుడు అప్పుడు. వాళ్ళ కుటుంభం బాగా ఆడంబరంగా గడిపింది ఎం కాదు, ఆలా అని కష్టాలలో పడిపోయి బాధల సముద్రంలో తేలేవాళ్ళు కాదు, వాళ్ళకి ఉన్న దానిలో ఆనందంగా బ్రతికినవారు. అది నా కళ్ళతో చూసాను, చిత్ర వాళ్ళ నాన్నగారు బ్యాంకులో క్లర్క్ గ చేసేవారు, అది చిన్న పనా చెప్పండి, ఉదయానే వెళ్ళినాదెగ్గర నుంచి అటు ఇటు తెగ తిరగాల్సి వచ్చేపని. అయినా అయన ఈరోజు నేను చేయలేను అని చెప్పడం నేను చూడలేదు. ప్రతిరోజూ సాయంత్రం మేము పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్నపుడు అయన మా అందరికి ఒక జీడీ ఇచ్చేవారు అది చప్పరిస్తూ చిత్ర వాళ్ళ ఇంటి అరుగు బయట కూర్చొని కబ్బుర్లు చెప్పుకునే వాళ్ళం, అక్కడే పెద్ద వాళ్ళు అంత కబుర్లు చెప్పుకుంటూ చీకటి పడి అందరిని దోమలు వచ్చి పలకరించగా, వాటిని తోలుతూ ఆలా కడుపులోని ఆకలి కేకలకు సమాధానం వినిపించే అమ్మ మాటలు “అన్నం తినండి వచ్చి” అనేవరకు అందరం అక్కడే ఉండేవాళ్ళం.
ఆలా చిన్నపట్నుంచి కలిసి పెరిగాం చిత్ర నేను, చిత్ర వాళ్ళ నాన్న మేము 8th క్లాస్ లో ఉన్నపుడు చిత్ర పుట్టిన రోజుకి బహుమతిగా ఒక గాజు పెట్టెని ఇచ్చారు, ఇవాళ్టి నుంచి నీ ప్రతి పుట్టినరోజుకి ఇందులో ఒక కోరిక కోరుకొని ఆ కోరికని ఒక కాగితం మీద రాసి ఆ పెట్టెలో దాచాలి అని ఒక తీర్మానం(resolution) తీసుకున్నారు. ఆ ఆచారం అప్పట్నుంచి అలానే కొనసాగుతూ వచ్చింది, అర్జున్ వచ్చే ముందు వరుకు ఇంటర్ రెండవ సంవత్సరంలో చిత్ర IIT సెక్షన్ వైపుకి షిఫ్ట్ అయింది. అక్కడ వారి ఇద్దరికీ పరిచయం పెరిగి ఒకరిని ఒకరిని ఇష్టపడ్డారు, అలా ఒక రోజు కాలేజీ అయ్యాక ఇంటికి కలిసివెళ్లటం, కలిసిరావటం చేసేవాళ్ళు, మా ఊరు పెద్ద నగరం కాకపోవటంతో చిన్న చిన్న విషయాలకి చాల ఎక్కువ ఊహించుకునే రోజులు అవి. అర్జున్ వాళ్ళ స్నేహితుడు తన పాఠశాలలో చదివిన అమ్మాయిని లేచిపోయి పెళ్లి చేసుకోవటానికి సాక్ష్య సంతకానికి వెళ్తూ తోడుగా చిత్రని తీసుకొని వెళ్ళాడు. అదే చివరి సరి చిత్ర వాళ్ళ నాన్న మాట్లాడుకోవటం. ఆరోజు అక్కడ పెళ్లి చేసుకుంది చిత్ర వాళ్ళ మావయ్యా వాళ్ళ అమ్మాయి సంధ్య . ఏంటే ఇదంతా అని అడిగితే, నేను నెలఁతప్పనే ఈ విషయం ఇంట్లో తెలిస్తే చంపేస్తారే, అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను అందుకే పారిపోయి గుడిలో పెళ్లి చేసుకుంటున్నాము అన్నాడు. ఇంకా అక్కడే నాకు చిత్రకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఎంత వద్దు అని ఏడ్చి కొట్టి బ్రతిమిలాడి చెప్పిన సంధ్య విననేలేదు. మా నాన్న గురించి నాకు తెలుసు ఒప్పుకోరు అని ఏడ్చి ఏడ్చి వద్దు అంటే అక్కడే చచ్చిపోతాను అని చెప్పుకుంటూ వచ్చింది. ఆరోజు ఇంక ఏమాలోచించలేకపోయాం ఇంటికి పిచ్చి భయంతో వెళ్ళాం. కానీ వెళ్ళేటప్పటికీ ఆరోజు చిత్ర వాళ్ళ మావయ్య గుండెపోటుతో చనిపోయారు, ఆ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేసే రంగమ్మ ఊరులో అందరికి చెప్పేసింది అది ఆరోజు పొలం నుంచి ఇంటికి వస్తున్న దారిలో అందరు చిత్ర వాళ్ళ మావయ్యని వేరేలా చూడటం చూసి ఆరాతీస్తే ఈ విషయం తెలిసింది అందరు నానా మాటలు అంటం మొదలు పెట్టారు అయన ఇంటికి వచ్చే దారిలో అందరి మాటలు వింటూ తట్టుకోలేకపోయారు. వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరు లేకపోవటంతో ఉరివేసుకోవటానికి తాడు కడుతుంటే సంధ్య వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఆపేసారు. అక్కడ ఆ బాధని, కోపాన్ని తట్టుకోలేక చెమటలు పట్టుకొచ్చి బీపీ తగ్గిపోయి గుండెపోటు వచ్చి చనిపోయారు.
ఇంటికి వెళ్ళేటప్పటికి అందరూ అప్పటికే చేరి ఉన్నారు, చిత్ర వాళ్ళ నాన్న చిత్రని చూడగానే వచ్చి చెంపమీద కొట్టారు, ఆరోజు వరుకు ఎప్పుడు ఒక మాట కూడా అనని చిత్ర వాళ్ళ నాన్న, ఒక్కసారిగా కొట్టేటప్పటికీ చిత్ర ఎం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత అందరూ మల్లి సర్దుకునేటప్పటికీ ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఆరు నెలలలో చిత్ర వాళ్ళ నాన్న ఒకసారి కూడా మాట్లాడలేదు. ఇంటర్ పరీక్షలు అయిన చివరిరోజున చిత్రకి వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేసేసారు. చిత్ర ఎంత ఏడ్చి జరిగింది అరిచి గీపెట్టి చెప్పిన వాళ్ళ నాన్న అన్న ఒకటే మాట “నేను కూడా ఆలా చనిపోవటం నా కన్న కూతురిగా చూడాలి అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్లి అబ్బాయిని పెళ్లి చేసుకో” అన్నారు. నేను చేయని తప్పుకి నన్ను కూడా బలిఅవ్వమంటున్నారు అనే కోపంతో, చిత్ర వాళ్ళ నాన్నతో మాట్లాడటం మానేసింది. ఒకే ఊరిలో ఉన్న ఒక్క మాట కూడా మల్లి మాట్లాడలేదు. తర్వాత అంత మాములుగా సాగిన చిత్రగారి నాన్న గారు మాట్లాడటానికి ప్రయత్నించినా మాట్లాడలేదు. ఒకరోజు పోదున్నే చిత్ర బట్టలు ఆరేస్తూ ఉన్నపుడు, చిత్ర వాళ్ళ నాన్న గారు కూరగాయలు తీసుకొని రావటానికి అని వెళ్లొచ్చి సైకిల్ స్టాండ్ వేస్తూ చిత్ర వైపు చూసి నవ్వారు. ఇంట్లోకి వెళ్తూ మెట్లు ఎక్కుతున్నపుడు కాళ్లు జారీ తల వెళ్ళి మెట్టుకి తగిలింది బాగా గెట్టిగా తగిలేటప్పటికీ అక్కడే చనిపోయారు.
ఇదంతా చిత్ర కళ్ళ ముందే జరిగింది, అసలు వాళ్ళ ఇంట్లో జరగని ఒక గొడవకి పరిస్థితులు ఇలా అయిపోతాయి అని ఎప్పుడు అనుకోలేదు, ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన నాన్న మాట కూడా వినకుండా ప్రాణం మూగబోయేటప్పటికీ చిత్ర మనసు, మాట రెండు నిశ్శబ్దంలోకి వెళ్లిపోయాయి.
ఆ తర్వాత కాలాంతరం వాళ్ళ అమ్మ కాలం చేసారు, ఇంకా ఆ ఇంటికి కానీ వాళ్ళ నాన్నగారి గదిలోకి కానీ వెళ్ళటానికి దైర్యం చేయలేకపోయింది. కోపంతో నేనే మాట్లాడలేకపోయాను అనే ఆలోచన ఇంకా ఇంకా కిందకి వెళ్లిపోయేలా చేసింది. ప్రతిరోజూ వాళ్ళ నాన్న గది వైపుకి చూస్తూ కూర్చునేది. ఇలా అయితే అవ్వదు అని చిత్ర భర్త ఆ ఇంటిని రిమోడెలింగ్ కి పిలిపించారు. చిత్రాగారి నాన్నగారి గది సర్దుతున్నప్పుడు చిత్ర కి బహుమతిగా ఇచ్చిన ఆగాజు పెట్టె బయటకి వచ్చింది. ఆ పెట్టెను తీసుకొచ్చి చిత్రకి ఇచ్చారు వాళ్ళ భర్త.
చిత్రకి గుర్తుఉన్నంత వరుకు ఆ గాజు పెట్టె లో కేవలం నాలుగు కాగితాలు మాత్రమే వేసినట్టు గుర్తు కానీ అందులో తాను రాసినవి కాకుండా మొత్తం పదకుండు చిట్టీలు ఉన్నాయి.
చిత్ర అవి తెరవటం మొదలు పెట్టింది.
- “నా బంగారు తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి” – 2008
- “నా బంగారు తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి” – 2009
- “నా బంగారు తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి” – 2010
- “నా బంగారు తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి” – 2011
- “నా బంగారు తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి” – 2012
- “నా బంగారు తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి” – 2013
- “నా బంగారు తల్లి నవ్వాలి, నాన్న నువ్వు నవ్వితే నేను పడే కష్టం,కోపం, బాధ, ఆనందం, అన్నిటికి మించిన ఒక పరమానందం వస్తుంది నాన్న. కొంచెం నవ్వు నాన్న” – 2014
- “నా బంగారు తల్లి ఎప్పుడు ఆనందంగా ఉండాలి” – 2015
- “నా బంగారు తల్లి ఎప్పుడు ఆనందంగా ఉండాలి” – 2016
- “నా బంగారు తల్లి ఎప్పుడు ఆనందంగా ఉండాలి” – 2017
పడకుండవ చిట్టి తీయగానే చిత్ర అరుస్తూ బాధనంతా బయటపెడుతూ ఏడ్చింది. అందులో
ఇల్లు అంత నిశ్శబదం నిండి పోయినట్టు ఉంది తండ్రి, చిన్న చిన్న దూది లాగా మెత్తటి చేతులతో కాళ్లతో మొదటిసారి చూసినట్టే ఉంటుంది అది ఏంచేసినా, ఎంత గొడవ అయినా చేయని ఒకసారి ఆలా కూర్చొని చుస్తే మొదటిసారి చేతిలోకి తీసుకున్న చంటి పిల్లల ఉంటుంది తండ్రి, నాకంటూ తండ్రి అవ్వగలిగె అవకాశాన్ని ఇచ్చింది. నాకు నువ్వు ఇచ్చిన ఇంటికి మహాలక్ష్మిలా వచ్చింది. ఒక తల్లి తండ్రి అనుభూతిని కలిపించిన వరం తండ్రి నా బిడ్డ. అలాంటిది ఆరోజు ఏంజరిగింది అని కూడా అడగలేకపోయాను, పొరపాటున కూడా చేయి చేసుకొని నేను, అంత మంది ముందు అంత గెట్టిగా కొట్టింది నాకు ఇప్పటికి నా చేతికి తెలుస్తూనే ఉంది. చిత్ర వేరే వాళ్ళని ప్రేమించటం తప్పు కాదు తండ్రి, సంధ్య అయినా కూడా కానీ ఆ పాప చేసిన ఒక చిన్న పని వల్ల తనని కన్న ప్రాణం పోయింది, అలానే ఆరోజు చిత్ర అక్కడ ఆ అబ్బాయితో ఉండటం వల్ల, చావు ఇంట్లో కూడా పరువు తీయటానికి ప్రయత్నం చేసే మనుషులు ఉన్న ఊరు ఇది ఇది ఆ చిన్న పిల్లకి అర్థంకాదు. ఆలా అని తను ప్రేమించిన అబ్బాయికి నేనేమి వ్యతిరేకం కాదు. చిత్ర అడిగే ముందే ఆ ఇంటి గురించి ఆరాతీసాను, ఆరోజే తెలిసింది అంత మంది బావ చనిపోయారు అని ఏడుస్తుంటే అక్కడ ఒక ఆమె పెంపకం బాలేనపుడు ఏంచేస్తాడు ఇలాంటోళ్ళు నాఇంట్లో పుట్టివుంటే చంపేసి పాతేసేదని అని చెప్పింది. నాకు అంత మందిలో కూడా ఆమె మొహం ఇప్పటికి గుర్తుంది. ఒక అమ్మ అయ్యి ఉండి ఆలా మాట్లాడింది, ఆ ఇంటికి ఈ దైర్యంతో పంపను తండ్రి నా కూతురు ఆనందంగ ఉంటుంది అని? తన పరువు ముందు ఒక ప్రాణం విలువ ఎంత అన్న కుటుంభం వాళ్ళది. అలానే అప్పులు కూడా ఉన్నాయి, వాళ్ళ తండ్రి వడ్డీ వ్యాపారం మీద సాగుతుంది ఇళ్ళు వాళ్ళ అమ్మ మీద అంత మంచి అభిప్రాయం లేదు ఊరులో ఎవరికిను. అలాంటి ఇంట్లోకి ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్న మా అమ్మ తండ్రి చిత్ర ఏ దైర్యంతో ఇచ్చి పెళ్ళిచేయాలి అని అనిపించింది అందుకే అంత గొడవ చేశాను, ఇది నేను చెప్పిన అర్థంచేసుకుని వయసు కాదు, సంధ్య విషయం వల్లే నా జీవితం ఇలా చేసారు అని తాను అనుకుంటుంది. కానీ నేనే ఇవాళ ఎలా అయినా చెపుదాం అనుకుంటున్న, నా కళ్ళలోకి కూడా చూడట్లేదు తను, నాన్న అని పిలిచి సంవత్సరాలు అయిపోయింది. నేను వస్తే పారిపోతుంది, నేను ఉంటె తను ఉండట్లేదు, నాకు ఎదురు పడిన తప్పించుకొని చూడకుండా వెళ్ళిపోతుంది. ఒక నవ్వు నవ్వి ఊరుకోవటం తప్ప ఎంచేయలేకపోయాను, ఎంత మాట్లాడదాం అని ప్రయత్నిస్తున్న ఒకసారి కూడా నావైపు చూడట్లేదు మాట్లాడట్లేదు తండ్రి. (చిత్ర పేజీ వెన్నకి తిప్పింది)
చిత్ర ఈ జీవితంకి అర్ధం ఎం ఉండదు నాన్న, కానీ ఈ జీవితంలో అందం నుంచి ఆనందం వరుకు కారణం ఒక ప్రాణం అవ్వగలదు అని నిన్ను ఈ భూమి మీద మొదటిసారి చూసినపుడు అనిపించింది నాన్న, నీకు ఈ ప్రపంచంతో చాల పనులు ఉండచ్చు, కానీ ఒక తండ్రిగా నీకు ఏమికాకుండా చూసుకోటం నా బాధ్యత నాన్న, ఇప్పుడు నీకు అర్ధం అవ్వకపోవచ్చు, కానీ వెళ్లేకొద్దీ అర్ధమవుతుంది నాన్న ప్రేమ అనేది నువ్వు నాన్న, నువ్వు ప్రేమించే వ్యక్తి ఒకరే కాదు, వాళ్ళు నీ జీవితంలోకి వచ్చినపుడు ఒక అనుభూతి కలుగుతుంది కాదు అది నీ మీద నీకు ఉన్న ప్రేమ నాన్న, అది రూపాన్ని బట్టి చూపించే విధానం మారుతుంది నాన్న. ఆ విధంగా చూసుకుంటే ఈ ప్రపంచం మొత్తని ఇస్తా అన్న నిన్ను వెలకట్టలేదు నాన్న అది నువ్వంటే, నేను తీసుకున్న పద్ధతి సరియైనదే, అది చెప్పే విధానం సరిగ్గా చెప్పలేకపోయాను. అంత బాధగా ఉన్నపుడు ఎంచేసుకుంటావనే భయం కోపం రూపాన నీ చెంతకి చేరాల్సి వచ్చింది మల్లి తిరిగి రాయలేని మేకులై నీ గుండెలో ఉండిపోయినాయి. కుదిరితే క్షమించు నాన్న, ఆలా మాట్లాడకుండా ఉండకురా, ప్రాణం పోతున్నట్టు ఉంది. నాన్న అని పిలిస్తే వినాలని ఉంది. మళ్ళీ మనం సరదాగా నడుచుకుంటూ బయటకి వెళ్లి తిరిగి రావాలని ఉంది. కలిసి వంట చేసి అమ్మని ఏడిపించి, అందరం కలిసి తినాలి అని ఉంది, నువ్వు చెప్పే కబుర్లు అన్ని వినాలని ఉంది. రోజు పొద్దున్న లేవగానే కిటికీ లోనుంచి నువ్వు లేచావా లేదా అనేది కనిపిస్తుంది అది చూసుకొని, ఆలా బ్రతికేస్తున్న ఇప్పటికి అయినా క్షమించు నాన్న, నాతో మాట్లాడు రా చిన్న. ఈ పుట్టినరోజు కోరిక, మనం మాట్లాడుకొని అన్ని మర్చిపోయి ఇంతకముందులా ఉండటం.
ఇట్లు,
మీ నాన్న.
